సందీప్ కిషన్ ‘నిను వీడని నీడను నేనే’ సెకండ్ లుక్

నిను వీడని నీడను నేనే.. ఈ లైన్ వింటేనే ఇదేదో భయపెట్టే సినిమాలానే ఉంది అని చాలా మందికి అనిపిస్తుంది. నిజమే ఇది హారర్ సినిమానే. చిమ్మ చీకట్లో మీ నీడ కాకుండా మరో నీడ మిమ్మల్ని వెంటాడితే ఎలా ఉంటుంది? గుండె ఆగినంత పనవుతుంది. ఇప్పుడు సందీప్ కిషన్‌ది అదే పరిస్థితి. ఆయన్నీ ఒక నీడ వెంటాడుతోంది. ఆ నీడ ఎవరు? ఆ నీడ వెంటాడటానికి కారణం ఏంటి? తెలియాలంటే వేసవి వరకూ ఎదురు చూడాలి. మండుటెండల్లో థియేటర్లో మాంచి హారర్ ఎంటర్‌టైనర్ చూపిస్తానని సందీప్ కిషన్ చెబుతున్నారు.

సందీప్ కిషన్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న సినిమా ‘నిను వీడని నీడను నేనే’. విస్తా డ్రీమ్ మర్చంట్స్‌తో కలిసి సందీప్ కిషన్ నిర్మాణ సంస్థ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ (ప్రొడక్షన్ నంబర్ 1), వి స్టూడియోస్ సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకుడు. సందీప్ కిషన్ సరసన అన్యా సింగ్ కథానాయికగా నటిస్తుంది. దయా పన్నెం, విజి సుబ్రహ్మణ్యన్, సందీప్ కిషన్ నిర్మాతలు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర చిత్రాన్ని సమర్పిస్తున్నారు. మహా శివరాత్రి సందర్భంగా ఈ సినిమా సెకండ్ లుక్ విడుదల చేశారు. వేసవిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఈ లుక్ యువతను ఆకట్టుకునేలా ఉంది. ఈ లుక్‌లో మంచి రొమాంటిక్ టచ్ ఉంది. సినిమా చిత్రీకరణ పూర్తయిందని, ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని నిర్మాతలు వెల్లడించారు. ఈ సినిమా విజువల్‌గా చాలా రిచ్‌గా ఉంటుందని చెప్పారు. త్వరలో టీజర్, వేసవిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, పూర్ణిమ భాగ్యరాజ్, ప్రగతి తదితరులు నటిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *