మెగాస్టార్ చిరంజీవికి ఉన్న అభిమానగణం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా పోస్టర్‌పైన ఈగ వాలినా మెగా తమ్ముళ్లు ఊరుకోరు. అలాంటిది ఆయన ఎవరగ్రీన్ సినిమాలు, వాటి టైటిళ్లు, పాటలను ఎవరైనా టచ్ చేస్తే ఊరుకుంటారా? ఇప్పుడు నేచురల్ స్టార్ నానికి వార్నింగులు ఇస్తున్నారు. దీనికి కారణం ఆయన కొత్త సినిమాకు చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీ టైటిల్‌ను వాడుకోవడమే.

విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో హీరో నాని నటిస్తోన్న సినిమాకి ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్‌ను పెట్టిన సంగతి తెలిసిందే. నాని పుట్టినరోజు సందర్భంగా ఆదివారం టైటిల్ టీజర్‌ను విడుదల చేశారు. అంతే మెగా ఫ్యాన్స్‌కు పౌరుషం పొడుచుకొచ్చింది. మెగాస్టార్ క్లాసికల్ టైటిల్‌ను నువ్వెలా వాడతావ్ అంటూ నానిపై ఫైర్ అవుతున్నారు చిరు ఫ్యాన్స్. ‘బాయ్‌కాట్ నానీస్ గ్యాంగ్‌లీడర్’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్‌లో ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఇది మెగాస్టార్‌ మాత్రమే వాడుకునే టైటిల్ అని ఇంకెవ్వరూ వాడటానికి వీళ్లేదని ఖరాఖండిగా చెబుతున్నారు. ఎంత ధైర్యముంటే మెగాస్టార్ టైటిల్‌ను టచ్ చేస్తావంటూ నానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది ‘నాని సార్ దయచేసి టైటిల్ మార్చుకోండి’ అంటూ వినమ్రంగా అడుగుతున్నారు.

ఏది ఏమైనా ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్‌ను నాని వాడుకోవడం మెగాస్టార్ ఫ్యాన్స్‌కు అస్సలు నచ్చలేదు. నిజానికి ఈ టైటిల్‌తో రామ్ చరణ్ సినిమా తీస్తే బాగుంటుందని మెగాఫ్యాన్స్ ఆశించారు. ఒకానొక దశలో ‘వినయ విధేయ రామ’ సినిమాకి ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ పెట్టాలనుకున్నారు. కానీ, రామ్ చరణ్ ఒప్పుకోకపోవడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. అయితే, ఐదుగురు ఆడవాళ్ల గ్యాంగ్‌కు లీడర్‌గా నాని నటిస్తోన్న చిత్రానికి ఈ పవర్‌ఫుల్ టైటిల్‌ను పెట్టడం పట్ల మెగా అభిమానులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. మరి ఈ టైటిల్‌పై నాని పునరాలోచిస్తారో లేదో చూడాలి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *