గంగూలీ సీఎం కావాలేమో..?: పాక్ మాజీ క్రికెటర్

భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చేసిన ‘మ్యాచ్ బహిష్కరణ’ వ్యాఖ్యలపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ ఘాటుగా స్పందించాడు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో.. ప్రపంచకప్‌లో పాక్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలని సూచించిన గంగూలీ.. ఒక్క క్రికెట్‌ అనే కాదు.. హాకీ, ఫుట్‌బాల్ తదితర గేమ్స్ దాయాది దేశంతో భారత్ ఆడకూడదని సూచించాడు. ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి వన్డే ప్రపంచకప్ మొదలుకానుండగా.. షెడ్యూల్ ప్రకారం జూన్ 16 భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది.

‘సౌరవ్ గంగూలీ రాబోవు ఎన్నికల్లో పోటీచేయాలని ఆశపడుతున్నాడేమో..? అతను ముఖ్యమంత్రి కావాలని ఆరాటపడుతున్నట్లున్నాడు. అందుకే.. ప్రచారం కోసం ‘మ్యాచ్ బహిష్కరణ’ వ్యాఖ్యలు చేసి అందర్నీ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు. పుల్వామా దాడి తర్వాత భారత్ వ్యవహరిస్తున్న తీరుపై మాకేమీ చింతలేదు. పాకిస్థాన్ ఎప్పుడూ భారత్‌‌తో శాంతిపూర్వక సంబంధాల కోసం ప్రయత్నిస్తోంది. కానీ.. ప్రతిసారి భారత్ నెగటివ్‌గానే స్పందిస్తోంది’ అని మియాందాద్ వెల్లడించాడు.

భారత్ జట్టు ఒకవేళ పాక్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తే..? అప్పుడు పాకిస్థాన్‌ను విజేతగా ప్రకటించి రెండు పాయింట్లు కేటాయిస్తారు. అదే జరిగితే ఇప్పటి వరకూ ప్రపంచకప్‌లో భారత్‌పై ఒక్కసారి కూడా గెలుపొందని పాకిస్థాన్‌ను చేజేతులా మనమే తొలిసారి గెలిపించినట్లవుతుందని దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్‌లు గుర్తు చేశారు. అలాకాకుండా.. మరోసారి పాక్‌ని ఓడించాలని వారిద్దరూ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *