వైసీపీ సర్కారు అధికారంలోకిటీడీపీ నేతలు గొట్టిపాటి రవి పోతులకు చెందిన క్వారీలపై మాత్రం ఒత్తిళ్లు కొనసాగుతున్నాయి

ఏపీలో గతేడాది అధికారంలోకి వచ్చాక పలువురు టీడీపీ నేతలను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వైసీపీ మాట వినకుంటే ఎంతకైనా తెగించేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో పలువురు టీడీపీ నేతలను టార్గెట్‌ చేసిన వైసీపీ సర్కారు.. తాజాగా ప్రకాశం జల్లాలో టీడీపీ నేతలకు చెందిన గ్రానైట్‌ క్వారీలను మూసివేయించడం తీవ్ర కలకలం రేపుతోంది.

ఇది జిల్లాలో టీడీపీ నేతలకే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ నేతలకు ఓ సంకేతం పంపేందుకే అన్నట్లుగా మారింది. ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని లెక్కచేయకుండా గనులశాఖ ఈ క్వారీలను మూయించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. జగన్ కక్ష సాధింపు… గతేడాది వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నేతలకు చుక్కలు కనిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా టీడీపీలోని బలమైన నేతలను ఆకర్షించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న వైసీపీ.. దారిలోకి రాని నేతలపై సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగిస్తోంది.

ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేతతో మొదలుపెడితే తాజాగా ప్రకాశం జిల్లాలో గ్రానైట్‌ క్వారీల మూసివేత వరకూ ఇదే పద్ధతి కొనసాగుతోంది. విపక్ష నేతలను వైసీపీలోకి తీసుకొచ్చేందుకు తెరవెనుక సాగుతున్న ప్రయత్నాలు కొన్ని సందర్భాల్లో అనివార్యంగా బహిర్గతమవుతూనే ఉన్నాయి. వీటి విషయంలో ప్రభుత్వ అధికారులు చూపుతున్న అత్యుత్సాహం వారిని న్యాయస్ధానాల్లో ఇరుకునపెడుతుండటం ఇక్కడ మరో సమస్య. ప్రకాశం క్వారీలపై కన్ను… రాష్ట్రంలో గ్రానైట్‌ క్వారీలకు ప్రకాశం జిల్లా పెట్టింది పేరు.

ఇక్కడ వేల సంఖ్యలో ఉన్న గ్రానైట్‌ క్వారీల నుంచి దేశ విదేశాలకు ఎగుమతులు జరుగుతుంటాయి. వీటిలో అత్యధిక భాగంగా టీడీపీ నేతల చేతుల్లోనో లేక ఒకప్పుడు వైసీపీలో ఉండి ప్రస్తుతం టీడీపీలో ఉన్న నేతల చేతుల్లోనో ఉన్నాయి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ ఇంతకాలం కాలం గడిపేసిన ఈ క్వారీల యజమానులు..

ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అదే తరహాలో విఫలయత్నం చేశారు. కానీ ఇవన్నీ టీడీపీ నేతల చేతుల్లో ఉండటంతో వాటిపై వైసీపీ సర్కారు ఈసారి కనికరం చూపలేదు. దీంతో గతంలో విధించిన పెనాల్టీలు, తాజాగా విధించిన జరిమానాలు అన్నీ కలుపుకుని ఒకేసారి చెల్లించాలనే ఒత్తిళ్లు మొదలయ్యాయి.

వైసీపీ సర్కారు అధికారంలోకి రాగానే టీడీపీ నేతలు గొట్టిపాటి రవి, శిద్ధా రాఘవరావు, పోతుల రామారావుకు చెందిన క్వారీల్లో గ్రానైట్‌ నిక్షేపాల వెలికితీతకు పర్మిట్లు నిలిపేసారు. వీరిలో శిద్ధా తాజాగా వైసీపీ పంచన చేరిపోయారు. దీంతో ఆయనకు ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ గొట్టిపాటి, పోతులకు చెందిన క్వారీలపై మాత్రం ఒత్తిళ్లు కొనసాగుతున్నాయి. పర్మిట్ల నిలిపివేతపై హైకోర్టును ఆశ్రయించి వీరిద్దరూ అనుమతులు తెచ్చుకున్నారు. కానీ ప్రభుత్వం కాలుష్య నియంత్రణ మండలి తనిఖీలతో వాటికి బ్రేక్‌ వేయించింది. దీన్ని కూడా హైకోర్టు తప్పుబట్టింది. వారికి పర్మిట్లు ఇచ్చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అయినా వాటిని ఇప్పటివరకూ ప్రభుత్వం లెక్క చేయలేదు. చివరికి క్వారీయింగ్‌ లోపాల పేరుతో వాటిని ఏకంగా మూత వేయించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *